7, డిసెంబర్ 2014, ఆదివారం

మూడు గంటల మంత్రి పదవి...(నాయకురాలు నాగమ్మ-6)



        గురజాల రాజ్యం లో విపరీతంగా దొంగతనాలు ప్రబలి పోయాయి. ప్రజలు, వ్యాపారులు రాజుగారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. 

     గ్రామాలలోని సమయ పాలకులందరూ నాగమ్మ వద్దకు వెల్లి తమ గోడు చెప్పుకున్నారు. (బ్రహ్మనాయుడి ఆగడాలను అడ్డుకోలేక పోతున్నామని నలగామ రాజు తమ్ముడు నరసింగరాజు నాగమ్మను పాలనలో జోక్యం చేసుకోవాలంటూ ప్రాధేయ పడినట్లు కొందరు రచయితలు రాశారు) అది నిజం అయి వుండక పోవచ్చు. ఎందుకంటే రాజకీయాలలో వుండేవారు సామాన్యులు ఎంత మేధావులైనా వారిని చిన్న చూపే చూస్తారు కాబట్టి నాగమ్మను నరసింగరాజు ప్రాధేయ పడడం కల్పన అయి వుండవచ్చు. ప్రజల వ్యాపారుల విన్నపాలే నిజమయి వుంటాయి.
          ఈ నేపథ్యం లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు నాగమ్మ ముందు ఏర్పడ్డాయి. 

      సుదీర్ఘంగా ఆలోచించిన నాగమ్మ అనుగురాజు గతంలో తనకు చేసిన వాగ్దానాన్ని వినియోగించుకోవాలని  నిర్ణయించుకుంది. ఏడు ఘఢియల సమయం నాగమ్మకు ఆమెకోరిన సమయంలో తన వారసులెవరు వున్నా మంత్రి పదవి ఇవ్వాలని రాసి ఇచ్చిన వాగ్దాన పత్రం తీసుకుని రాజ సభకు చేరుకుంది నాగమ్మ. 

       అప్పుడు బ్రహ్మనాయుడు గురజాలలో లేడు. అది యాధృచ్చికమో లేక నాగమ్మ అదే సమయాన్ని ఎంచుకుందో తెలియదు కానీ ఆమెకు రాజు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇచ్చాడు. 

       ఏడు ఘఢియలంటే నేటి మన కాలమానం ప్రకారం రమారమి మూడు గంటల కాలం మాత్రమే. ఆ కొద్ది సమయం లో అమె మంత్రికి వుండే అన్ని అధికారాలను వినియోగించుకుంది. 
    
     దండనాయకులను తీసుకుని బ్రహ్మనాయుడి అనుచరుల ఇళ్ళపై దాడులు చేశి సోదాలు చేసింది. ధనం, వస్తుసంపద, స్వాధీనం చేసుకుని రాజుగారి ఎదుటికీ తీసుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో దోషులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు.

        వారికి నాలుగు తగిలించేసరికి వాస్తవాలు బయటపెట్టారు. ఈ అరాచకాల వెనుక బ్రహ్మనాయుడు వున్నాడన్న వాస్తవం బయట పడే సరికి గ్రామాల పాలకులకు ఏం సమాధాన చెప్పాలో రాజుకు అర్థం కాలేదు. 

      ఈ లోపు పొరుగూరు వెళ్ళిన బ్రహ్మనాయుడు తిరిగొచ్చాడు. సభలో విచారణ జరిగింది. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ బ్రహ్మనాయకుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రహ్మనాయుడు ఏమీ మాట్లాడ లేక పోయాడు. ఏం చేయమంటారు బ్రహ్మన్నగారూ  అని రాజుగారు అడిగారు.

        మీ ఇష్టం ప్రభూ.... అన్నాడు బ్రహ్మన్న.

      రాజ్యంలో ప్రజలను కాపాడాల్సిన స్థాయిలో వుండి ప్రజా సంపదను దోచుకోవడానికి కారకుడైన బ్రహ్మన్నను కఠినంగా శిక్షించాలని సభికులు కోరారు. 

      దోషి స్థానంలో వున్న బ్రహ్మన్న మాట్లాడలేదు.

        అనుగు రాజు మరణం తరువాత గురజాల రాజ్యానికి బ్రహ్మనాయుడు చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్న సభ బ్రహ్మనాయుడిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయింది. 

     నాటి ఆచారాల ప్రకారం బ్రహ్మనాయుడి కుటుంబాన్ని, ఆయన అనుచరుల కుటుంబాలను కులం నుండి బహిష్కరించారు. నాటి శెట్టి సమయాల ఆచారం ప్రకారం వెలివేయబడిన కుటుంబాలకు ఎవరూ సేవలందించ కూడదు. చాకలి బట్టలు వుతకడు, మంగలి క్షవరం చేయడు, కుమ్మరి కుండలు ఇవ్వడు. బేదరి స్మశానంలో శవాన్ని సైతం తగులబెట్టడు. వెలివేయబడిన వారి జీవితం చాలా దుర్భరంగా వుండేది. 

        రాజ్యాన్ని సంక్షోభంలోనుండి గట్టెక్కించిన నాగమ్మను శాస్విత మంత్రిగా వుండిపోవాల్సిందిగా రాజుతో సహా, గ్రామ సమయాల పాలకులు సైతం కోరడంతో నాగమ్మ చరిత్రలో తొలి మహిళా మంత్రిణిగా బాధ్యతలు చేపట్టింది. ఇలా రెడ్డిగారి నాగమ్మ నాయకురాలు నాగమ్మ అయింది.  

                 నేటి "వెలమకులం" బ్రహ్మనాయుడితోనే ప్రారంభమైందా....తరువాత టపాలో చూడండి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి