20, అక్టోబర్ 2014, సోమవారం

శీలం బ్రహ్మనాయుడు "శీలవంతుడు" కాదా (నాయకురాలు నాగమ్మ-2)



     దైవాంశ సంభూతుడుగా ప్రచారం చేయబడిన బ్రహ్మనాయుడు శీలవంతుడు కాదా??? అమాయక ప్రజలను అబద్ధాలతో,భ్రమలతో మోసం చేశాడా????

      అవుననే అనాల్సి వస్తోంది. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని మనం భావిస్తున్న బ్రహ్మనాయుడు. తండ్రి లాంటి అనుగురాజును చంపించాడా? అడ్డం వచ్చిన తనతండ్రి దొడ్డనాయుడిని కూడా చంపించాడా??? జిట్టగామాలపాడు  వాస్తవ్యురాలు ఆరవెల్లి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డిని, మేనమామ మేకపొతుల జగ్గరెడ్డిని అమానుషంగా చంపించాడా????

    చివరికి నలగామరాజు అల్లుడు అలరాజును తన ప్రియ పుత్రుడు కన్నమదాసుతో చంపించాడా??? శాంతియుతంగా వున్న పలనాడును రెండుగా చీల్చింది తన స్వార్థం కొరకేనా??? తన ఉనికిని పటిష్టం చేసుకోవడానికే పలనాటి యుద్ధమనే మారణహోమాన్ని సృష్టించాడా? అవసరం లేకపోయినా, యుద్ధాన్ని నివారించ గలిగే అవకాశాలు వున్నా పలనాటి యుద్ధం ఎందుకు జరిగింది??? నాలుగు పుట్ల నల్లపూసలు నాగులేటి ఒడ్డున ఎదుకు రాలాయి??? వీటన్నిటికీ కారకుడు బ్రహ్మనాయుడే అయివుండి అపవాదులు నాయకురాలిపై ఎందుకు మోపాడు?  

      పలనాటి యుద్ధ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, పరిశొధిస్తే అవాక్కయ్యే నిజాలు తెలుస్తాయి. సచ్చీల నాగమ్మపై బ్రహ్మనాయుడు క్రక్కిన విషపు జ్వాలల వేడి మన హృదయాన్ని తాకుతుంది. 

అసలు ఈ పలనాడు రాజ్యం సంగతేందో చూద్దాం.

     ఇప్పటి వరకు లభించిన, అందరు రచయితలు ఏకాభిప్రాయానికి వచ్చిన ఆధారల ప్రకారం పలనాటి కథ 11,12 శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. 

      హైహేయ  రాజవంశానికి చెందిన రాజు అనుగురాజు. ఇతడు ఉత్తరాది నుండి దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన పూర్వీకుల పాపాల వల్ల తనకు కష్టాలు వచ్చాయని పండితుల సలహా ప్రకారం తీర్థ యాత్రలు చేస్తూ కృష్ణానది లో మునగగా తాను ధరించిన జీడిబట్టలు తెల్లగా మారి పాపప్రక్షాలన జరిగింది. అందు వల్ల ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇదీ సంక్షిప్తంగా అనుగురాజు కథ. 

     అనుగురాజు నిజంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తీర్థ యాత్ర ముగియగానే తన రాజధానికి వెళ్ళీపోయి వుండేవాడు. కానీ వెళ్ళకుండా ఇక్కడే స్థిరపడిపోయాడు. 

     నిజానికి అనుగురాజు రాజ్యాన్ని శత్రువుల దండయాత్రలలో కోల్పోయి వుండవచ్చు. తన బంధువర్గంతో రాజ్యాన్ని విడిచి శత్రువుల బారినుండి తమను రక్షించుకోవడానికి దక్షిణాదికి వచ్చి వుండవచ్చు. రాజ్యం కోల్పోయిన తరువాత తన కష్టాలకు కారణం ఏమిటని పండితులను అడిగి వుండవచ్చు. దానికి పండితులు మీ పూర్వీకుడు కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి కనుకనే నీకీ కష్టాలు అని చెప్పి వుండవచ్చు. ఈ కారణం  పైనే చాలామంది రచయితలు "కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు తన వంశీయులను అందరిని బధ పెట్టకుండా నన్నే ఎందుకు బధపెడుతున్నాయి" అని అనుగురాజు ఎందుకు అడగలేదో అంటూ చతురోక్తులు వాడారు. 

    అలా దక్షిణాదికి వచ్చిన అనుగురాజుకు చందనవోలు రాజు (వెలనాటి గొంకరాజు,వెలనాటి గొంకరాజు రాజేంద్ర చోడుడు అయి వుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయము. ఈయన చతుర్థజ కులజుడని శాసనాలలో రాసి వుంది)తన కుమార్తె మైలమాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఆమెకు అరణంగా గురజాల సీమను ఇచ్చాడు. 

మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మన దృష్టితో చూద్దాం. 

     ఎక్కడో రాజ్యాన్ని పోగొట్టుకుని వచ్చిన అనామకుడికి ఎవరైనా కుమార్తెనిచ్చి, రాజ్యాన్నిస్తారా???? ముక్కుముఖం తెలియని వానికి అసలు కుమార్తెనే ఏ బుద్ధితక్కువ వాడు కూడా ఇవ్వడు. ఇక్కడ చందనవోలు రాజు కుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. 

     అంటే ఇక్కడ చందనవోలు రాజుకు, అనుగురాజుకు ఖచ్చితంగా బంధుత్వం వుండేవుంటుంది. అందుకే చెడి తన పంచకు వచ్చిన వానికి పిల్లనిచ్చి రాజ్యాన్ని కూడా ఇచ్చి వుంటాడు. అలా గురజాల రాజధానిగా పలనాటి ప్రాంతానికి అనుగురాజు రాజయ్యాడు. ఆయనకు మంత్రి దొడ్డ నాయుడు. ఆ కాలంలో నాయుడు, నాయకుడు అనే బిరుదులను కేవలం సైనిక కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే లభించేవి. కనుక ఈ దొడ్డనాయుడు రాజబంధువుల కుటుంబానికి చెందిన వాడు అయి వుండవచ్చు. చందనవోలు రాజుకు అత్యంత నమ్మకస్తుడు అయినా అయివుండవచ్చు. అలా రాజయిన అనుగురాజుకు దొడ్డనాయుడు మంత్రి అయ్యాడు. ఈయన కేవలం మంత్రి మాత్రమే కాదు రాజుకు అత్యంత సన్నిహితుడు కూడా అయివుండాలి. ఎందుకంటే పిల్లలు లేని అనుగురాజు దొడ్డనాయుడు పెద్ద కుమారుడు బాదరాజును పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలానికి బాదరాజుకు పెళ్ళి చేసి ఒక పట్టణానికి పాలకుడిగా నియమిచినట్లు ఒక సమాచారం కాగా బ్రహ్మనాయుడే మంత్రి  పదవి కొరకు అన్నను, తండ్రిని తుదముట్టించాడని కొందరు రాశారు. బాదరాజు పాలకుడే అయివుంటే యుద్ధ కాలం నాటికి ఎవరి తరపుననో ఒకరి తరపున యుద్ధం లో పల్గొని వుండేవాడు కానీ ఆయన యుద్ధం చేయలేదు. అంటే పలనాటి యుద్ధకాలం నాటికే మరణించి ఉండాలి. 

     అనుగురాజుకు ముగ్గురు భార్యలు వీరవిద్యలదేవి లేదా వీర విద్యాదేవి. రెండవ భార్య భూరమదేవి, మూడవ భార్య మైలమాదేవి.

    మూడవభార్య మైలమాదేవి కుమారుడే నలగామరాజు. అంటే  అనుగురాజు పలనాటికి వచ్చేనాటికే ఇద్దరు భార్యలు వుండి వుండాలి. అందుకే మైలమాదేవి మూడవభార్య అయింది.

   అంతే కాక మైలమాదేవికే మొదటి సంతానం కలిగి వుంటుంది అందుకే మైలమాదేవి కుమారుడైన నలగామరాజే అనుగురాజు తరువాత రాజైనాడు. నలగామరాజు 13 సంవత్సరాల వయసుకే రాజైనట్లు తెలుస్తోంది.

    అంటే అప్పటికే అనుగురాజు మృతి చెందాడు. బ్రహ్మనాయుడు అనుగురాజు వద్ద మంత్రిగా పని చేసినట్లు లేదు కనుక ఆయన కూడా అయన తండ్రి దొడ్డనాయుడి మరణం తరువాతనే మంత్రి అయినట్లు తెలుస్తోంది. నలగామరాజు రాజుగా, బ్రహ్మానాయుడు మంత్రిగా ఒకేసారి పదవులు స్వీకరించారా???

   అలా స్వీకరించడానికి ముందు అనుగురాజు ఎలా మరణించాడు, దొడ్డనాయుడు ఎలా మరణించాడు అన్నదానికి వివిధ రచయితలు ఏమిరాశారో పరిశిలిద్దాం....

                                                          ఇంకా  ఉంది తరువాత టపాలో ...