4, డిసెంబర్ 2014, గురువారం

పలనాటిలో పెచ్చుమీరిన అరాచకం....(నాయకురాలు నాగమ్మ-5)



          అనుగు రాజు మరణం తరువాత చిన్నరాణి మైలమాదేవి ఒక్కగానొక్క కుమారుడు రాజపుత్రులందరిలోకి పెద్దవాడు 13 సంవత్సరాల నలగామరాజు సింహాసనమధిష్టించాడు. నలగాముడు చిన్నపిల్లవాడు కావడంతో మంత్రి బ్రహ్మనాయుడే అధికారాన్ని చలాయించాడు. 

    స్వతహాగా బ్రహ్మనాయుడు వ్యభిచారని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. బ్రహ్మనాయుడు ప్రదిపాదించిన, ఆయనకు చరిత్రలో సంస్కరణవాది అని పేరు తెచ్చిపెట్టిన చాపకూటి సిద్ధాంతం గురించి చాలమంది రచయితలు గొప్పగా వర్ణించారు. "చాపకూటి సిద్ధాంతం" అంటే "సహపంక్తి భోజనాలు" అని కులమతాలకు అతీతంగా దాన్ని బ్రహ్మనాయుడు ప్రతిపాదించాడని చాలమంది నేటికీ అపోహ పడుతుంటారు కానీ అది తప్పు .

     నిజానికి చాపకూటి సిద్ధంతం అంటే ఒక చాపను పరిచేవారు ఆ చాపపై అన్నం, కూరలు వంటి ఆహార పదార్తాలను వడ్డించేవారు. ఒకవ్యక్తి ఆ చాపపై అన్నం కలుపుకుని తిని వెళ్ళిన తరువాత అదే ప్రదేశంలో తరువాత వచ్చిన వారు అన్నం కలుపుకుని భుజించాలి. ఇది చాలా అనాగరిక వ్యవహారం కావడంతో నాటి వ్యవస్థలో బ్రహ్మనాయుడిపై వ్యతిరేకత వచ్చిందంటారు. ఈ చాపకూటి సిద్ధాంతం వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోవడంతో ప్రజలలో బ్రహ్మనాయుడి పట్ల అసంతృప్తి జ్వాలలు రగిలాయంటారు. 

       బ్రహ్మనాయుడి కౄర స్వభావానికి భయపడ్డవారు ఆయన వ్యవహారాలను ప్రశ్నించలేక పోయారు. చివరికి రాజు నలగాముడు సైతం బ్రహ్మనాయుడిని అడ్డగించలేక పోయాడని అంటారు. అందుకే ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ నలగాముడు మిన్నకుండిపోయాడే కానీ బ్రహ్మనాయుడిని అదుపుచేయలేక పోయాడు. దీంతో బ్రహ్మనాయుడి అనుచరగణం ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా సాగింది. అనుచరులలో కొందరు బ్రహ్మనాయుడి అండ చూసుకుని వ్యాపారులను దోచుకోవడం, దొంగతనాలు చేయడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ  పరిస్థితులలో కొట్టుమిట్టాడారు. 

         ఇక్కడ చరిత్రకారులు మరచిపోయిన కొన్ని వ్యవస్థల గురించి చెప్పుకోవాలి. నాటి కాలంలో భారతదేశం నుండి పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిగేవి. ఈ వ్యాపారస్తులకు సంబంధించి ట్రేడ్ యూనియన్ లు వుండేవి. వాటిని శెట్టిసమయాలు, వణిజసమయాలు అని పిలిచేవారు. ఈ సమయాలకు ఎక్కువగా నాటి పాలకుల బంధువులే నాయకులుగా వ్యవహరించేవారు. ఈ సమయాలు (యూనియన్లు) కొన్నికులాల సముదాయాలు.

           ఈ సమయాలకే గ్రామాలలో అధికారాలు వుండేవి. గ్రామాధికారులను శెట్టి, దేశాయి, రెడ్డి అని పిలిచేవారు. ఈ సమయ పాలకులు పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం వంటి అధికారాలను కలిగి వుండేవారు. యుద్ధాల వలన రాజులు మారినా ఈ సమయాలు  మాత్రం యధావిధిగా పనిచేసేవి. రాజులు కూడా ఈ సమయాల సలహా సంప్రదింపులతోనే రాజ్యపాలన కొనసాగించేవారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల వలన ఈ సమయాలు క్రీ.శ.1వ శతాబ్దం వాడైన కరికాళచోళుని కాలంలో ప్రారంభమైనట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. భారతదేశం ప్రపంచదేశాలలో అత్యున్నత నాగరికతను అనుభవించడానికి ఈ సమయాలే కారణం. 

        ఇక్కడ కులం గురించి అసందర్భమైనా ఒక చిన్న విషయం చెప్పుకోవాల్సిన అవసరం వుంది. ప్రాచీన భారతీయులు చాలా మేధావులు వారికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే జన్యుపరంగా సంక్రమించే నైపుణ్యం గురించిన అవగాహన వుంది. 

        నేడు చాలామంది కుహనా మేధావులు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి చాలా కులాలు వుండడమే కారణం అంటారు. కొందరైతే కులం గోడలు బ్రద్దలు కొడదాం రండి అంటూ పిలుపునిస్తుంటారు. 

     పాశ్చాత్య ప్రపంచంలో "మెండెల్" ప్రకటించిన తరువాతనే జాతులు వంశపారంపర్య లక్షణాలను కలిగి వుంటాయని తెలిసింది. 

      ఈ సంగతి ప్రాచీన భారతీయులకు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలుసు. అందుకే కులాలను ఏర్పరిచారు. ఈ కులాలు వృత్తుల వారీగానే ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకతరం సంపాదించుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న తరువాతి తరం దాన్ని మరింత మెరుగుపరచి ముందుతరానికి అప్పగించేది. అలాంటప్పుడు ఒక రకమైన సాంకేతికతను ఆ కులం వారే కొనసాగించేవారు. తరతరాలుగా ఆ రంగాలలో నైపుణ్యం సంపాదించేవారు. కుల సంకరం జరిగితే నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం వుందన్న విషయం ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు. 

         నేడు మనం జన్యు స్వచ్చత గురించి మాట్లాడుతుంటాము. సంకరజాతి వంగడాలకు జన్యు స్వచ్చత వుండదు. మన పూర్వీకులు మనుషులాలో కూడా జన్యు స్వచ్చతను కాపాడేందుకే కులాల ఏర్పాటును చేశారు. అలా తరతరాలుగా సాంకేతికత జన్యు రూపంలో సంక్రమిస్తూ వస్తోంది. కానీ నేడు పంచామృతం లాంటి మన గొప్పదనానికి కల్తీ కల్లు వంటి పాశ్చాత్య సంస్కృతి కి వున్న తేడాను తెలుసుకోలేక పోతున్నాము.

ఇక కథలోకి వద్దాం ...

       అలా కొన్ని వృత్తులకు సంబంధించిన కులాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే వెసులుబాటు ఆ కాలంలో వుండేది. ఈ కులాలన్నిటికీ "మహానాడు"లు  అనే వేదికలపైన కట్టుబాట్లు, హద్దులు నిర్ణయించేవారు. అవే నాటి శాసనాలు. 56 దేశాలుగా(చప్పన్న దేశాలు) పిలువబడిన అఖండ భారతదేశం మొత్తం ఈ మహానాడులలో జరిగే శాసనాలకు ప్రజలు కట్టుబడి జీవించేవారు. ఇక మన కథలో...

       జిట్టగామాల పాడు గ్రామ పెద్దలు నాగమ్మ కుటుంబీకులు. నాగమ్మ తండ్రి తీర్పులు చెప్పడంలో దిట్ట అని మనం చదువుకున్నము కదా. అంటే ఆ పరగణాలో నాగమ్మ కుటుంబం ఖచ్చితంగా సమయ పాలకులు అయివుండాలి. 

           సాధారణంగా మనకు ఒక వ్యక్తి అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి గిట్టని వ్యక్తికి చెప్పుకోవడం జరుగుతుంది. కౌటిల్యుని అర్థ శాస్త్రం ప్రకారం శత్రువు శత్రువు మిత్రుడవుతాడు. 

       అదే విధంగా ఇక్కడ బ్రహ్మనాయుడు అతని అనుచరులు చేస్తున్న ఆగడాల గురించి దోపిడీకి గురైన సమయాల వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. రాజు కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అమ్మా నాగమ్మా నువ్వే ఎలాగయినా మమ్మల్ని, మా వ్యాపారాలను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం చాటున చేస్తున్న దురాగతాలు ఆమె చెవిని చేరాయి. 

ఇక్కడ మరో చిన్న వివరణ ఇవాల్సి వస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. 

          కులాలన్నీ ఒక్క మాటపైన ఉన్న సమయాల గురించి మనం తెలుసుకున్నాము. నిజానికి నాటి ప్రజలంతా ఒక్కమాటపైనే వుండేవారా... ఈ రచయిత చెబుతున్నది ఎంతవరకు నమ్మవచ్చు...నిజమే ఆ కాలంలో కులాల వారీగా వున్న సమూహాలు అన్నీ ఎప్పుడూ ఒకటిగా లేవు. పూర్వాచార, వామాచార కులాలుగా ఏర్పడ్డాయి. వీరిని కుడి, ఎడమ చేతుల కులాలు అనికూడా అంటారు. 

      పూర్వాచార కులాలు అంటే ప్రాచీన ఆచారాలు, కట్టుబాట్లు క్రమశిక్షణాయుతమైన జీవితానికి కట్టుబడి జీవించేవారు. వామాచార కులాలు ఎప్పుడు వీరికి వ్యతిరేకమే వీరు స్వతహాగా ఆధునిక భావాలు కలవారు. ఈ రెండు వర్గాలలో పూర్వాచార కులాలు మెజారిటీ కులాలు కావడం తో వామాచార కులాలపై ఎప్పుడూ పైచేయిగానే వుండేవారు. 

       పూర్వాచార కులాలు కులసంకరానికి పూర్తిగా వ్యతిరేకం అయితే వామచారకులాలు కులసంకరాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. విధవా వివాహాలకు పుర్వాచార కులాలు వ్యతిరేకమైతే వామాచార కులాలు అనుకూలంగా వుండేవి. ఇల ఈ రెండు వర్గాలూ ఒకరు ఎడ్డేమంటే మరొకరు తెడ్డెమనేవారు.

          నాటి రాజులు, గ్రామాధికారులూ మెజారిటీ వర్గాలైన పూర్వాచార కులాలకు చెందిన వారే. 

        అందుకే బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకూటి సిద్ధాంతం పూర్వాచార కులాల కట్టుబాట్లను బ్రష్టు పట్టించేవిధంగా వుండడంతో ఆ వర్గాలన్నీ ఆగ్రహంతో రగిలి పోయాయి. అందుకే ఆయా వర్గాలు అన్నీ నాగమ్మను ఆశ్రయించి ప్రతిఘటించాల్సిందిగా కోరి వుండవచ్చు. 

         పదవులకు దూరంగా ప్రశాంతంగా ఆశ్రమం నిర్మించుకుని జీవిస్తున్న నాగమ్మ కులాల శ్రేష్టులు అంతా తనను ఆశ్రయించినప్పుడు కాదనలేక ఆలోచనలో పడింది. బ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి నాగమ్మ రంగంలోకి దిగక తప్పలేదు. 

        నాగమ్మ ఏం చేసింది... ఎలా బ్రహ్మనాయుడి అనుచర సామ్రాజ్యాన్ని ఢీకొట్టింది...బ్రష్టు పడుతున్న వ్యవస్థను ఒక్క అబల ఎలా సరిదిద్దింది నేటి తరం ఊహించను కూడా ఊహించలేని  సాహస మహిళ నాగమ్మ ఎలా సాధించిందో ....
                                                          తరువాత టాపాలో చూద్దాం...