1, డిసెంబర్ 2014, సోమవారం

అనుగురాజు మరణం ఒక మిస్టరీ....(నాయకురాలు నాగమ్మ-3)



         అనుగురాజు మరణం గురించి మౌఖిక కథల్లోనూ చాలమంది రచయితల కథల్లోనూ ఈ విధంగా రాశారు. 

     బ్రహ్మనాయుడు సింహాసనానికి నమస్కరించాడు... వెంటనే సింహాసనం పేలిపోయింది. పగిలిపోయిన సిమ్హాసనం లో నుండి ఒక ముక్క ఎగిరి వచ్చి అనుగురాజును తగిలింది దానితో అనుగురాజు మరణించాడు. ఇది మనమయితే నిజంగానే నమ్మము. కానీ బ్రహ్మనాయుడిని విష్ణువాంశ సంభూతునిగా భావించే ప్రజలు మాత్రం నమ్మారు. కాదు బ్రహ్మనాయుడి స్వంతమీడియా నమ్మించింది. 

     నిజానికి అనుగు రాజు మరణించే నాటికి నలగామరాజుకు 13 సంవత్సరాలు. అంటే పెంపుదు కొడుకు బాదరాజు బహుశా యువకుడై వుండవచ్చు. బ్రహ్మనాయుడు కూడా యవ్వనంలో వుండివుండవచ్చు. తండ్రి దొడ్డనాయుడు తదనంతరం బాదరాజు మంత్రి కావాలి కానీ బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడు అంటే ఇక్కడ బాదరాజు ఎందుకు మంత్రి కాలేక పొయాడు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాదరాజు చనిపోయి అయినా వుండాలి లేదా పదవి వద్దు అని ప్రక్కకు తప్పుకుని అయినా వుండాలి. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కించుకున్న బ్రహ్మనాయుడు తండ్రిని, అన్నను హతమార్చి వుంటాడా? చాలామంది రచయితలు అన్నను తండ్రిని హతమార్చి మంత్రి అయ్యాడనే రాశారు. ఇది అంతగా మనం నమ్మాల్సినంత అవసరం లేదేమో... ఏది ఏమైనా తండ్రి, అన్న ల అడ్డు తొలగిన తరువాతనే బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడన్నది వాస్తవం. 

        ఈ నేపధ్యం లో అనుగురాజు మరణం మాత్రం మిస్టరీ గానే మిగిలింది. వాస్తవానికి అనుగురాజుకు వేట అంటే ప్రాణం. ఒక సారి వేటకు వెళ్ళిన సమయంలో వెనుక నుండి ఒక సైనికుడు వేసిన బాణం గురితప్పి అనుగురాజుకు తగిలి మరణించాడు. ఆ వేట సమయం లో బ్రహ్మనాయుడు కూడా అదే బృందంలో వున్నాడు. తన అనుచరుడి ద్వారా బాణం వేయించి అనుగురాజును హత్య చేయించాడనే ఆరోపణలు వున్నాయి. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు "నమస్కారం పేలిపోయిన సిం హాసనం" అంటూ కట్టు కథలు కల్పించారు. ఎవరిపైనా అనుమానం లేని అనుగురాజు జరిగింది నిజంగా ప్రమాదమేనని నమ్మాడు. తన పిల్లలు చిన్న వారని వారి బాధ్యతలు పట్టించుకోవాలని బ్రహ్మనాయుదిని ఆదేశించి చనిపోయాడు. ఈ నిజం తరువాత నిలకడమీద తెలిసి వుంటుంది. 

    ఈ సంఘటనను బట్టి బ్రహ్మనాయుడు మొదటి నుండీ పథకాలు పన్నడంలో మాంచి ఘటికుడే నని అర్థమవుతోంది.

     అలా రాజ్యం పై బ్రహ్మనాయుడు పెద్దరికాన్ని సంపాదించుకున్నాడు. గురజాల సిం హాసనం పై పేరుకు నలగామ రాజు కూర్చున్నప్పటికీ పెత్తనం మాత్రం బ్రహ్మనాయుడే చలాయించాడు. 

     అనుగు రాజు రెండవ భార్య భూరమాదేవికి నలుగురు కుమారులు కామరాజు, నరసింగరాజు, జెట్టి రాజు, పెరుమాళ్ళు రాజులు.

      పెద్ద భార్య వీరవిద్యల దేవికి ముగ్గురు కుమారులు పెద్ద మల్లదేవుడు, పినమల్లిదేవుడు, బాల మల్లిదేవుడు. వీరందరూ చాల చిన్నవారు. ఇలా  ఈ పిల్లలందరూ పెద్దవారయ్యేనాటికి రాజ్యం మొత్తం బ్రహ్మనాయుడి గుప్పిటిలోనే వుంది. పేరుకు రాజు నలగాముడే అయినప్పటికీ మొత్తం పరిపాలన అంతా బ్రహ్మనాయుడే నడిపించాడు. ఈ క్రమంలో బ్రహ్మనాయుడికి అత్యంత సన్నిహితులు, మిత్రబృందాలూ ఏర్పడ్డాయి. మామూలే కదా అధికారం ఎక్కడ వుంటే ఈగలు కూడా అక్కడే వుంటాయి!!! 

     ఇలా ఎలాంటి అడ్డంకులూ లేకుండా పరిపాలన సాగుతుండగా...రాజ్యంలో విపరీతంగా దొంగతనాలు, దారిదోపిడీలు విపరీతంగా జరగడం మొదలయ్యాయి. వ్యాపారులు సంతలలో వ్యాపారాలు చేసుకోలేక పోయారు. ఎక్కడి బండ్లను అక్కడే అటకాయించి దొంగలు యథేచ్చగా దోచుకుంటున్నారు. వ్యాపారులు మొదట మంత్రిగారికి ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు నేరుగా రాజుగారికే ఫిర్యాదు చేశారు కానీ ఆయన మంత్రి గారినే పురమాయించడంతో పరిస్థితి యథాతథంగానే ఉండిపోయింది. ఈ పరిస్థితిలో   ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని వ్యాపారులు,వృత్తుల వారు, ప్రజలు నాగమ్మను ఆశ్రయించారు. ఈ దొంగతనాల వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల హస్తం ఉందని అందుకే బ్రహ్మనాయుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎలాగయినా తమను కాపాడమని ఆమెను ప్రాధేయ పడ్డారు. 

       రాజు, మహామంత్రుల మీదనే నాగమ్మకు ప్రజలు ఫిర్యాదులు చేశారంటే అసలు ఎవరు ఈ నాగమ్మ??? ఈ నాగమ్మకు ఉన్న అధికారమేంటి??? ఒక వితంతువు పైన ప్రజలకు ఇంత నమ్మకమేంటి???  

                                      ....    తదుపరి టపాలో పరిశీలిద్దాం.  .....