14, అక్టోబర్ 2014, మంగళవారం

పలనాటి యుద్ధం ఏకపక్షంగా వ్యక్తీకరించబడింది. (నాయకురాలు నాగమ్మ -1)




         పలనాటి యుద్ధానికి సంబంధించిన గాధ మొత్తం ఒక వర్గం కోణం లోనే ఆవిష్కరించబడినట్లు కనిపిస్తుంది.. శ్రీనాథుడు సైతం ఒకవైపు నుండే చూసి పలనాటివీరచరిత్రాన్ని రాసినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఈ కథను మౌఖికంగా ప్రచారం చేసిన వీరవిద్యలవాండ్ల ద్వారా చెప్పించుకుని దానిని తనదైన శైలిలో గ్రంధస్తం చేసి వుండవచ్చు.

     ఎందుకు ఇలా ఒక వర్గం కోణం లోనుండే పలనాటి యుద్ధ చరిత్ర రాయబడిందని నేను ఆరోపిస్తున్నానంటే ఈ కథలో వున్న పాత్రలు అన్నీ ఎక్కువగా బ్రహ్మనాయుడి వర్గానికి సంబంధించిన వారివి కావడం, వారితో సంబంధాలు ఉన్నవారివే కావడం వలన నేను ఈ అభిప్రాయానికి రాక తప్పడం లేదు.

     నాగమ్మ వర్గం వైపు పాత్రలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరిగి వుంటుందంటే ఈ కథను ఎక్కువగా ప్రచారం చేసిన కళాకారులు. బ్రహ్మన్నాయుడి కి సన్నిహితులు కావడం తో వారికి బ్రహ్మనాయుడి వైపు పాత్రల పరిచయం మాత్రమే వుంటుంది. నాగమ్మ వర్గీయులలో చాలామంది వివరాలు బయటకు రాకపోవడానికి వారి గురించి ఈ కళాకారులకు  తెలియకపోయివుండవచ్చు. 

    ఇక మరో విషయం ఏమిటంటే పలనాటి వీరుల చరిత్రలు చెప్పే వీరవిద్యల వాండ్లు అనుగురాజు పెద్ద భార్య వీరవిద్యాదేవి పేరు పైన ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

   అంటే ఆ కాలంలోనే ప్రచార మాధ్యమాల ప్రభావాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్న వ్యక్తి బ్రహ్మనాయుడని చెప్పుకోవచ్చు. ఈ ప్రచార బృందాల ఏర్పాటులో రాణిపేరును వినియోగించుకున్న బ్రహ్మనాయుడు  నేటి ఆధునిక  రాజకీయనాయకుల పంధాను (సోనియాగాంధి ప్రాపకం కొరకు రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ఏర్పాటు)  900 ఏళ్ళక్రితమే అమలు చేశాడంటే నిజంగా ఆశ్చ్యర్యం వేస్తుంది.

    అలా బ్రహ్మన్నాయుడి అండదండలతో ఏర్పడిన ఈ కళా బృందాలు తమకు అన్నం పెట్టిన వారిని కీర్తించక మరెవరిని కీర్తిస్తారు? 

    ఈ క్రమంలోనే వారు ఈటు వైపు చూపిన శ్రద్ధ వైరి పక్షం పాత్రల పై చూపలేక పోయి వుండవచ్చు అంద్కుకే నాగమ్మ వర్గం వారి వివరాలు పూర్తిస్థాయిలో  లభించవు. 

    మలిదేవరాజు అంతఃపురం కాపలా యువతి "మాడచి" అన్న పేరును కూడా ప్రచారం చేయగలిగిన వారు నాగమ్మ కుటుంబం గురించి కూడా సరిగా వివరాలందించలేకపోయారు. బ్రహ్మనాయుడి దత్తు కుమారుల పేర్లు సైతం చెప్పగలిగిన వారు నలగామరాజు భార్య వుందో లేదో కూడా చెప్పలేక పోయారు. 

   మనం సాధారణంగా గమనిస్తుంటాము. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడినప్పుడు ఎవరి ని వారు తమను సమర్థించుకుంటూ వాదనలు వినిపిస్తారు. నాకెందుకో పలనాటి చరిత్రలో వీరవిద్యావంతులు కానీ, శ్రీనాథుడు గానీ బ్రహ్మనాయుడి తరపున వాదనలు వినిపించినట్లుగానే కనిపిస్తోంది. ఓక వైపు వారు చెప్పే కథ విని అవతలి వారిని దుర్మార్గులుగా వర్ణించడం ఎంతవరకు న్యాయం?


    పాపం నాగమ్మ ప్రచార మాధ్యమాల ప్రభావం తెలియని అమాయకురాలిలా కనిపిస్తోంది. జర్మనీ నియంత హిట్లర్ కు అత్యంత సన్నిహితుడు "పాల్ జోసెఫ్ గోబెల్స్" అనే నాజీ లీడర్. ఈయనను హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా నియమిచాడు. హిట్లర్ చేసే పనులన్నింటినీ చాలా గొప్పవని, హిట్లర్ అవతార పురుషుడని ఉత్త అబద్ధాల ప్రచారం చేసేవాడు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలలో హిట్లర్ గొప్ప నాయకుడిగా మనుగడ సాగించాడు. 

      ప్రచారం యొక్క ప్రభావం ఏంటో నాజీ నియంత హిట్లర్ కు తెలుసు. దానితోనే ప్రజలను మొసం చేశాడు కానీ ప్రపంచాన్ని మోసం చేయలెకపొయాడు.

      మన బ్రహ్మన్నాయుడు గారికి హిట్లర్ గారికి పోలికలేమైనా కనిపిస్తున్నాయా...

        నాకైతే కనిపిస్తున్నాయి.

    బ్రహ్మన్నాయుడిని విష్ణువాంశ సంభూతుడిగా ప్రచారం చేసిన వారికి, హిట్లర్ ను మించిన నాయకుడు ప్రపంచంలో లేడని ప్రచారం చేసిన గోబెల్స్ కు తేడా నాకెక్కడ కనిపించడం లేదు.

     అందుకే పలనాటి చరిత్ర ఏకపక్ష దర్పణమనే నేను అభిప్రాయపడుతున్నాను. అబద్ధాలు చెప్పేవాడు ఎక్కడో ఒకచోట తడబడతాడు.కానీ పలనాటి చరిత్రలో అలాంటి తడబాట్లు చాలా వున్నాయి.

      ఈర్ష్యతో ఉండేవాడు అసూయను, అక్కసును తన మాటల్లో వెళ్ళగక్కుతాడు. అలాంటి అక్కసు కూడా పలనాటి చరిత్రలో చాలాచోట్ల తారస పడుతుంది.   
                                                                                                                                             (ఇంకా వుంది)