2, డిసెంబర్ 2014, మంగళవారం

నాగమ్మ ఎలా నాయకురాలయింది... (నాయకురాలు నాగమ్మ-4)



నాగమ్మ... నాయకురాలు నాగమ్మ...

      నాగమ్మ ఇంటి పేరు నాయకురాలు కాదు. ఆ కాలంలో నాయకుడు, నాయుడు అనే బిరుదాలు (లేదా పదవులు) రాచరికం లో అంతర్భాగమైన సైనికులకు, సేనానాయకులకు కనిపిస్తాయి. చరిత్రలో చాలామంది పరిశోధకులు నాగమ్మ జన్మస్థలం నేటి కరీం నగర్ జిల్లాలోని ఆరవెల్లి గ్రామమేనని నిర్ధారణకు వచ్చారు. చాలమంది రచయితలు నాగమ్మ చౌదరి రామిరెడ్డికి అనాధగా దొరికిన బిడ్డగా రాశారు. చౌదరి రామిరెడ్డి కి నాగమ్మ అనాధగా దొరికిన బిడ్డనే అయితే నాగమ్మ తన  చివరి రోజుల్లో అదే ఆరవెల్లికి వెళ్ళి వుండేది కాదు. అక్కడే ఆమె చివరి రోజులు గడిపింది అన్న ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అనాధగా దొరికిందన్న కట్టుకథను కొట్టివేయక తప్పదు. 

     దీన్ని బట్టి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి నాగమ్మను తీసుకుని పలనాటి ప్రాంతంలోని జిట్టగామాలపాడుకు వచ్చి వుండవచ్చు. బహుశా ఆరవెల్లి ప్రాంతంలో కరువు ఏర్పడడమో లేక చౌదరి రామిరెడ్డి ఆర్థికంగా దెబ్బతినడమో, లేక నాగమ్మ తల్లి మరణించి నందు వల్ల ఆ బాధను మరచిపోవడానికి గ్రామాన్ని వదలి బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి పంచన చేరి వుండవచ్చు. మేకపోతుల జగ్గారెడ్డి జిట్టగామాలపాడులో బహుశా గ్రామ పెద్ద అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ చౌదరి, రెడ్డి అనే బిరుదులు లేదా పదవులు పెద్ద ఆస్తి పరులకు, గ్రామాధి కారులకు మాత్రమే ఉండేవి. 
     నేడు మనకు కనిపిస్తున్న రెడ్డి కులం, కమ్మ కులానికి చెందిన పదాలు కాదని గమనించాలి. 
   ఎందుకంటే నేడు రెడ్డి, కమ్మ అని పిలువబడే కులాలు నాటికి ఇంకా ఏర్పడలేదు కనుక ఈ పదాలు కులసూచకాలు కాదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే కమ్మ కులస్తులు కాకతీయుల కాలంలో కాపు కులం నుండి విడిపోయారని తెలుస్తోంది. కాకతీయులు పలనాటి యుద్ధం తరువాత రాజ్య పాలన చేపట్టారు. ఇక రెడ్డి అనే కులం అప్పుడు లేనే లేదు.

     అలా వలస వచ్చిన రామిరెడ్డి తన ఒక్కగానొక్క కుమార్తెకు క్షత్రియోచిత విద్యలన్నీ నేరిపించాడు. తెలుగు, సంస్కృత భాషలలో నాగమ్మ ప్రవీణురాలని తెలుస్తోంది. బ్రతుకుదెరువు కొరకు వలస వచ్చిన వ్యక్తి ఒక ఆడపిల్లకు ఇలా అన్నివిద్యలూ ఎందుకు నేర్పిస్తాడు? దీన్ని బట్టి చౌదరి రామిరెడ్డి బ్రతుకుదెరువును వెతుక్కుంటూ జిట్టగామాలపాడుకు రాలేదని అర్థమవుతుంది. మేకపోతుల జగ్గరెడ్డి కుమారుడు సింగారెడ్డి కి ఇచ్చి నాగమ్మకు బాల్య వివాహం చేశారు. చాలామంది రచయితలు నాగమ్మ భర్త పేరు తెలియదని రాశారు. కొంతమంది మేనమామ జగ్గరెడ్డినే వివాహం చేసుకుందని రాశారు. ఇందులో వివాదాలెలా వున్నా నాగమ్మకు మాత్రం బాల్యవివాహం జరిగిందన్నది మాత్రం అందరూ ఒప్పుకునే అంశం.
   
     ఈ నేపథ్యం లో జిట్టగామాలపాడులో చెరువు నిర్మాణం కొరకు భూమి సేకరణజరిగింది. అందులో ఏర్పడిన వివాదంలో నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి, మేనమామ జగ్గారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ వివాదం బ్రహ్మనాయుడికి జగ్గారెడ్డికి జరిగినది కావడంతో హత్య చేయించింది బ్రహ్మనాయుడే అని నిర్ధారణకు వచ్చారు. నాగమ్మ తండ్రి రామిరెడ్ది తీర్పులు చెప్పడంలో దిట్ట అని పేరుండేది. ఈయనను నిద్రిస్తుండగా మంచానికి కట్టివేసి సమీపంలో వున్న అడవిలోకి తీసుకు వెళ్ళి హత్య చేశారు. నిద్రిస్తున్న వాడిని హత్య చేశారు అంటే మెలకువగా వున్నప్పుడు ఆయనను ఏమీ చేయలేని పరిస్థితులు వుండి వుండవచ్చు. దీన్నిబట్టి చౌదరి రామిరెడ్డి మహావీరుడై వుండి వుండాలి, లేదా ఈయనను ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వుండి వుండాలి. అందుకే ఆయనను మంచానికి కట్టివేసి హత్య చేసి వుంటారు. జగ్గరెడ్డి హత్య గురించి వివరణ దొరకలేదు. 

     కానీ ఈ రెండు హత్యలూ బ్రహ్మనాయుడే చేయించాడనే అరోపణలు మాత్రం పలనాటి చరిత్ర రాసిన రచయితలందరూ ఏకీభవించారు.  

         ఈ విధంగా బ్రహ్మనాయుడి పై నాగమ్మకు వ్యతిరేకత ఏర్పడింది. 

     తండ్రి మేనమామ తరువాత గ్రామాధిపత్యం నాగమ్మనే చేపట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అనుగురాజు అడవిలో వేటాడి తిరుగు ప్రయాణంలో వుండగా ఆయనకు, ఆయన పరివారానికి చలువ పందిళ్ళు వేసి తృప్తితీరా భోజనం పెట్టింది. ఒక్కసారి ఆనాటి పరిస్థితులను బేరీజు వేద్దాం....

       రాజులకు భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్థాయిలో భోజనం పెట్టడం అంటే పెద్ద సంపన్నులయి వుండాల్సిందే. ఎంత సంపన్నులయినా ఎవరు పడితే వారు భోజనం పెడితే రాజులు భుజిస్తారా??? భారత దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులాల పట్టింపు వుండేది. అంతే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థాయిలో ఉండేవారి అహ్వానాలు మాత్రమే రాజులు మన్నించేవారు. దీన్ని బట్టి నాగమ్మ ఖచ్చితంగా ఆ ప్రాంత పాలనకు సంబంధించిన కుటుంబానికి చెందినదే అయివుండాలి. కత్తిసాము, అశ్వారోహణ, గజారోహణ, యుద్ధతంత్రాలు, సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యం. ఇలా సకల కళలు అభ్యసించిందంటే ఈమె సామాన్య కుటుంబంలో పుట్టిందని అభిప్రాయపడడం సమంజసమేనా???? 

        అనుగురాజు ఆనందపడే రీతిలో సత్కరించిందంటే ఏ స్థాయిలో సత్కరించి వుండాలి? ఆమె సత్కారాలకు ఆనంద భరితుడైన అనుగురాజు ఆమె కోరినప్పుడు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానని వరమిచ్చాడు. కాదు రాసి ఇచ్చాడు. వరం నాగమ్మే అడిగిందా లేక అనుగురాజే ప్రతిపాదించాడా? ఒక్క సారి విశ్లేషించి చూద్దాం. 

         భోజనం చేసిన తరువాత నాకు మంత్రి పదవి ఇమ్మని నాగమ్మే అడిగి వుంటుందా... అలా అడిగితే నాగమ్మ చులకన అయివుండేది. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడైన అనుగురాజు నీకేం కావాలో కోరుకో అని వుండవచ్చు. నాగమ్మ ప్రతిభాపాటవాల గురించి అనుచరులు చెప్పి వుండవచ్చు. అంతటి ప్రతిభా పాటవాలు కలిగివుండి ఈ మారుమూల గ్రామంలో ఎందుకున్నావని రాజు ప్రశ్నించి వుండవచ్చు. రాజ్య పాలనలో భాగస్వామివి కమ్మని రాజు ఆహ్వానించి వుండవచ్చు...వాటన్నింటిని నాగమ్మ సున్నితంగా తిరస్కరించి వుండవచ్చు... 

    పైన ఉదహరించిన ఊహలన్నీ నాకు నాగమ్మపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా. 

      నేను ఇలా ఎందుకు ఊహించడానికి తాపత్రయ పడుతున్నానంటే తల్లిదండ్రులను, భర్తను, మేనమామను కోల్పోయి వైరాగ్యంతో జీవిస్తున్న నాగమ్మ మంత్రి పదవి కొరకు ఆశపడిందంటే నా మనసు అంగీకరించడం లేదు. 

        అలాంటి నాగమ్మ ఏడు ఘడియల పాటు ప్రధానమంత్రి పదవి ఇమ్మని అడిగిందనే రచయితలు రాశారు. 

       నిజానికి పదవీ కాంక్ష ను నాగమ్మ కలిగి వుంటే రాజు అనుమతి ఇచ్చిన తక్షణమే పదవిని స్వీకరించివుండేది. కానీ తనకు ఇష్టమైనప్పుడు పదవి తీసుకుంటానని చెప్పింది. 

      ఇక్కడ నాగమ్మ కోరిక కంటే అనుగురాజు  వత్తిడి చేసినట్లుగానే కనిపిస్తుంది. మంత్రి పదవి స్వీకరించమంటే సమయమొచ్చినప్పుడు స్వీకరిస్తానని నాగమ్మ అని వుండవచ్చు. నీకు ఇష్టమొచ్చినప్పుడు నా వారసులు ఎవరు వున్నా నాగమ్మకు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇవ్వాలని దాన పత్రం లేదా ఫర్మానా రాసి ఇచ్చాడు అనుగురాజు. ఇక్కడ దాన పత్రం రాసి ఇచ్చినది అనుగురాజు కాదు నలగామరాజేనని కొంతమంది రచయితలు రాశారు. కానీ అది వాస్తవం కాదు నాగమ్మకు అనుమతి పత్రం రాసి ఇచ్చినది అనుగురాజేనన్నది వాస్తవం.

      అలా మంత్రి పదవి వద్దని తిరస్కరించిన నాగమ్మ ఏ పరిస్థితిలో మంత్రి పదవి తీసుకుంది చరిత్రలో తొలి మహిళ మంత్రిణిగా ఎలా తన కీర్తిని సుస్థిరం చేసుకుంది? 

                                                               తరువాయి టపాలో చర్చిద్దాం....