3, అక్టోబర్ 2014, శుక్రవారం

నాయకురాలు నాగమ్మ నాయకురాలే... ప్రతి నాయిక కాదు....



    


      వెయ్యి సంవత్సరాల క్రితం జీవించి ప్రపంచం లోనే తొలి మహిళా మహామంత్రిణి గా పిలువ బడిన నాయకురాలు నాగమ్మ. స్వార్థపరుల ఓర్వలేనితనం, కుహనా ప్రచారకుల అబద్ధపు ప్రచారాలతో ఆమెను ఓ విషపు నాగుగా చిత్రీకరించారు. పలనాటి యుద్ధం లో నాగమ్మే నిజమైన హీరో. అనేక  చారిత్రక అంశాలను పరిశీలించిన తరువాత నాగమ్మ ఉదాత్తత ను, గొప్పదనాన్ని బయటకు రాకుండా చరిత్రకు మసిపూసి మారేడుకాయను సృష్టించారనిపించింది. నిజానికి పలనాటి యుద్ధం జానపదుల మౌఖిక గాథ గానే ప్రచారం పొందింది. దానినే శ్రీనాథుడు "పల్నాటి వీరచరిత్రము" గ ద్విపదలో రచించారు. తరువాత చాలామంది రచయితలు చిలవలు పలవలు అల్లి దానినే మరింత అందంగా తీర్చిదిద్దారు.
       ఎవరి కథలో చూసినా నాగమ్మను కుటిలనీతికి ప్రతినిధిగానే చూపించారు. నాకు ఈ కథలు చదువుతోంటే ఎన్నో అనుమానాలు చాలాచోట్ల పూరించకుండా వదలివేసిన ఖాళీలు కనిపించాయి. కొన్నిచోట్ల నాగమ్మపై అక్కసు వెళ్ళగక్కుతున్నట్లుగా అనిపించింది. గురజాల ప్రాంతాన్ని ఏలుతున్న అనుగురాజు వేటకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో అనామకురాలైన నాగమ్మ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడై ఏడు ఘడియల పాటు మంత్రి పదవిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఎవరూ కూడా నాగమ్మ ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
    ఒక మహరాజుకు ఒక అనామకురాలు విందు ఏర్పాటు చేయడమేమిటి? ముక్కూ ముఖం తెలియని అనామకురాలు విందు ఏర్పాటు చేస్తే రాజు వెళ్ళి తినడమేంటి? అనామకులు విందుకు పిలిస్తే రాజు లాంటి వారు వారి సైన్యంతో విందుకు వెళతారా??? 
      ఇక మరో సందేహం ఎప్పుడో అనుగురాజు వాగ్దానం చేస్తూ ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానంటే దాన్ని ఆయన హయాం లోనే అనుభవించక అనుగురాజు కొడుకు నలగాముడు రాజ్యం చేస్తున్న కాలంలో నాగమ్మ ఎందుకు మంత్రి పదవిని కోరింది? 
      సరే నలగాముడి కొలువులో మంత్రి పదవి చేపట్టిన నాగమ్మ ఏడు ఘడియల తరువాత పదవిని ఎందుకు త్యజించలేదు? 
       కేవలం అతి కొద్దికాలం మంత్రి పదవిలో వున్న నాగమ్మ మాటలు విని కొన్ని ఏళ్ళుగా మంత్రి పదవిలో వున్న బ్రహ్మన్నను నలగాముడు ఎందుకు వదులుకున్నాడు.
      మంత్రి పదవి పోయిన తరువాత బ్రహ్మనాయుడు ఏంచేశాడు? 
     ఇలా ఎన్నో సందేహాలు. అబద్ధం చెప్పేవాడు ఎక్కడో ఒక చోట తడబడతాడంటారు. అలాంటి తడబాట్లు పలనాటి చరిత్రలో చాలా కనిపిస్తాయి. అలాంటి చోట్ల హాస్యాస్పదమైన కారణాలు చాలా చూపిస్తారు.
     ఇక బాలచంద్రుడినైతే ఏకంగా మహాభారతంలో అభిమన్యుడితో పోలుస్తారు. కొన్ని కథలలో ఏకంగా పలనాటి యుద్ధానికి బాలచంద్రుడు కారణమవుతాడని జ్యొతిష్కులు చెబితే బ్రహ్మనాయుడు చంపి వేయాల్సిందిగా ఆదేశించాడని రాశారు. 
   ఈ కథలలో బ్రహ్మనాయుడును కేంద్రంగా చేసి ఆయనను దైవాంశ సంభూతుడుగా చూపించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆయన కథానాయకుడైతే ఆయనకు వ్యతిరేకంగా వున్న నాగమ్మ ప్రతినాయకురాలేగా... బ్రహ్మనాయుడుకు లేని గొప్పదనాన్ని ఎలాగైతే అంటగట్టారో అలాగే నాగమ్మలో లేని దుష్ట లక్షణాలను ఆమెకు ఆపాదించారు. 
      వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇతిహాసాన్ని విశ్లేషించడం నిజంగా ఒక సాహసమే... ఆ సాహసానికి నేను ఒడిగట్టాను చరిత్రలో పూరణకు నోచుకోని అనేక  ఖాళీలను పూరించడానికి నడుంకట్టాను. నా  సాహసోపేతమైన ఈ నిర్ణయానికి స్వర్గంలో వున్న నా పెద్దలు, నా వంశీయులు, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందజేయమని వినమ్రతతో ప్రార్థిస్తున్నాను.

                                                                                                                                          -రచయిత 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి