20, అక్టోబర్ 2014, సోమవారం

శీలం బ్రహ్మనాయుడు "శీలవంతుడు" కాదా (నాయకురాలు నాగమ్మ-2)



     దైవాంశ సంభూతుడుగా ప్రచారం చేయబడిన బ్రహ్మనాయుడు శీలవంతుడు కాదా??? అమాయక ప్రజలను అబద్ధాలతో,భ్రమలతో మోసం చేశాడా????

      అవుననే అనాల్సి వస్తోంది. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని మనం భావిస్తున్న బ్రహ్మనాయుడు. తండ్రి లాంటి అనుగురాజును చంపించాడా? అడ్డం వచ్చిన తనతండ్రి దొడ్డనాయుడిని కూడా చంపించాడా??? జిట్టగామాలపాడు  వాస్తవ్యురాలు ఆరవెల్లి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డిని, మేనమామ మేకపొతుల జగ్గరెడ్డిని అమానుషంగా చంపించాడా????

    చివరికి నలగామరాజు అల్లుడు అలరాజును తన ప్రియ పుత్రుడు కన్నమదాసుతో చంపించాడా??? శాంతియుతంగా వున్న పలనాడును రెండుగా చీల్చింది తన స్వార్థం కొరకేనా??? తన ఉనికిని పటిష్టం చేసుకోవడానికే పలనాటి యుద్ధమనే మారణహోమాన్ని సృష్టించాడా? అవసరం లేకపోయినా, యుద్ధాన్ని నివారించ గలిగే అవకాశాలు వున్నా పలనాటి యుద్ధం ఎందుకు జరిగింది??? నాలుగు పుట్ల నల్లపూసలు నాగులేటి ఒడ్డున ఎదుకు రాలాయి??? వీటన్నిటికీ కారకుడు బ్రహ్మనాయుడే అయివుండి అపవాదులు నాయకురాలిపై ఎందుకు మోపాడు?  

      పలనాటి యుద్ధ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, పరిశొధిస్తే అవాక్కయ్యే నిజాలు తెలుస్తాయి. సచ్చీల నాగమ్మపై బ్రహ్మనాయుడు క్రక్కిన విషపు జ్వాలల వేడి మన హృదయాన్ని తాకుతుంది. 

అసలు ఈ పలనాడు రాజ్యం సంగతేందో చూద్దాం.

     ఇప్పటి వరకు లభించిన, అందరు రచయితలు ఏకాభిప్రాయానికి వచ్చిన ఆధారల ప్రకారం పలనాటి కథ 11,12 శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. 

      హైహేయ  రాజవంశానికి చెందిన రాజు అనుగురాజు. ఇతడు ఉత్తరాది నుండి దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన పూర్వీకుల పాపాల వల్ల తనకు కష్టాలు వచ్చాయని పండితుల సలహా ప్రకారం తీర్థ యాత్రలు చేస్తూ కృష్ణానది లో మునగగా తాను ధరించిన జీడిబట్టలు తెల్లగా మారి పాపప్రక్షాలన జరిగింది. అందు వల్ల ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇదీ సంక్షిప్తంగా అనుగురాజు కథ. 

     అనుగురాజు నిజంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తీర్థ యాత్ర ముగియగానే తన రాజధానికి వెళ్ళీపోయి వుండేవాడు. కానీ వెళ్ళకుండా ఇక్కడే స్థిరపడిపోయాడు. 

     నిజానికి అనుగురాజు రాజ్యాన్ని శత్రువుల దండయాత్రలలో కోల్పోయి వుండవచ్చు. తన బంధువర్గంతో రాజ్యాన్ని విడిచి శత్రువుల బారినుండి తమను రక్షించుకోవడానికి దక్షిణాదికి వచ్చి వుండవచ్చు. రాజ్యం కోల్పోయిన తరువాత తన కష్టాలకు కారణం ఏమిటని పండితులను అడిగి వుండవచ్చు. దానికి పండితులు మీ పూర్వీకుడు కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి కనుకనే నీకీ కష్టాలు అని చెప్పి వుండవచ్చు. ఈ కారణం  పైనే చాలామంది రచయితలు "కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు తన వంశీయులను అందరిని బధ పెట్టకుండా నన్నే ఎందుకు బధపెడుతున్నాయి" అని అనుగురాజు ఎందుకు అడగలేదో అంటూ చతురోక్తులు వాడారు. 

    అలా దక్షిణాదికి వచ్చిన అనుగురాజుకు చందనవోలు రాజు (వెలనాటి గొంకరాజు,వెలనాటి గొంకరాజు రాజేంద్ర చోడుడు అయి వుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయము. ఈయన చతుర్థజ కులజుడని శాసనాలలో రాసి వుంది)తన కుమార్తె మైలమాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఆమెకు అరణంగా గురజాల సీమను ఇచ్చాడు. 

మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మన దృష్టితో చూద్దాం. 

     ఎక్కడో రాజ్యాన్ని పోగొట్టుకుని వచ్చిన అనామకుడికి ఎవరైనా కుమార్తెనిచ్చి, రాజ్యాన్నిస్తారా???? ముక్కుముఖం తెలియని వానికి అసలు కుమార్తెనే ఏ బుద్ధితక్కువ వాడు కూడా ఇవ్వడు. ఇక్కడ చందనవోలు రాజు కుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. 

     అంటే ఇక్కడ చందనవోలు రాజుకు, అనుగురాజుకు ఖచ్చితంగా బంధుత్వం వుండేవుంటుంది. అందుకే చెడి తన పంచకు వచ్చిన వానికి పిల్లనిచ్చి రాజ్యాన్ని కూడా ఇచ్చి వుంటాడు. అలా గురజాల రాజధానిగా పలనాటి ప్రాంతానికి అనుగురాజు రాజయ్యాడు. ఆయనకు మంత్రి దొడ్డ నాయుడు. ఆ కాలంలో నాయుడు, నాయకుడు అనే బిరుదులను కేవలం సైనిక కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే లభించేవి. కనుక ఈ దొడ్డనాయుడు రాజబంధువుల కుటుంబానికి చెందిన వాడు అయి వుండవచ్చు. చందనవోలు రాజుకు అత్యంత నమ్మకస్తుడు అయినా అయివుండవచ్చు. అలా రాజయిన అనుగురాజుకు దొడ్డనాయుడు మంత్రి అయ్యాడు. ఈయన కేవలం మంత్రి మాత్రమే కాదు రాజుకు అత్యంత సన్నిహితుడు కూడా అయివుండాలి. ఎందుకంటే పిల్లలు లేని అనుగురాజు దొడ్డనాయుడు పెద్ద కుమారుడు బాదరాజును పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలానికి బాదరాజుకు పెళ్ళి చేసి ఒక పట్టణానికి పాలకుడిగా నియమిచినట్లు ఒక సమాచారం కాగా బ్రహ్మనాయుడే మంత్రి  పదవి కొరకు అన్నను, తండ్రిని తుదముట్టించాడని కొందరు రాశారు. బాదరాజు పాలకుడే అయివుంటే యుద్ధ కాలం నాటికి ఎవరి తరపుననో ఒకరి తరపున యుద్ధం లో పల్గొని వుండేవాడు కానీ ఆయన యుద్ధం చేయలేదు. అంటే పలనాటి యుద్ధకాలం నాటికే మరణించి ఉండాలి. 

     అనుగురాజుకు ముగ్గురు భార్యలు వీరవిద్యలదేవి లేదా వీర విద్యాదేవి. రెండవ భార్య భూరమదేవి, మూడవ భార్య మైలమాదేవి.

    మూడవభార్య మైలమాదేవి కుమారుడే నలగామరాజు. అంటే  అనుగురాజు పలనాటికి వచ్చేనాటికే ఇద్దరు భార్యలు వుండి వుండాలి. అందుకే మైలమాదేవి మూడవభార్య అయింది.

   అంతే కాక మైలమాదేవికే మొదటి సంతానం కలిగి వుంటుంది అందుకే మైలమాదేవి కుమారుడైన నలగామరాజే అనుగురాజు తరువాత రాజైనాడు. నలగామరాజు 13 సంవత్సరాల వయసుకే రాజైనట్లు తెలుస్తోంది.

    అంటే అప్పటికే అనుగురాజు మృతి చెందాడు. బ్రహ్మనాయుడు అనుగురాజు వద్ద మంత్రిగా పని చేసినట్లు లేదు కనుక ఆయన కూడా అయన తండ్రి దొడ్డనాయుడి మరణం తరువాతనే మంత్రి అయినట్లు తెలుస్తోంది. నలగామరాజు రాజుగా, బ్రహ్మానాయుడు మంత్రిగా ఒకేసారి పదవులు స్వీకరించారా???

   అలా స్వీకరించడానికి ముందు అనుగురాజు ఎలా మరణించాడు, దొడ్డనాయుడు ఎలా మరణించాడు అన్నదానికి వివిధ రచయితలు ఏమిరాశారో పరిశిలిద్దాం....

                                                          ఇంకా  ఉంది తరువాత టపాలో ...               

15, అక్టోబర్ 2014, బుధవారం

కాపులారా లేవండి వెంకయ్యనాయుడి కీర్తిని బ్రతికించుకుందాం ...




రఘుపతి వెంకయ్యనాయుడు నేటి మన తెలుగు సినిమాకు ఆద్యుడు. సినిమా కొరకే జీవించి, సినిమాను శ్వాసించి సినిమా కొరకు జీవితాన్నే కాదు ఆస్థిని కూడా అంకితం చేసిన కళాతపస్వి. 
ఆ కళాతపస్వి జన్మదినం నేడు. సినిమా కొరకు తనను తాను అర్పించుకున్న ఆ మహానుభావుడిని సినిమారంగం ఎంతవరకు గౌరవించింది. ఏ మేరకు మర్యాదనిచ్చింది. 
సినిమా రంగం మొత్తాన్నైతే నిందించను ఎందుకంటే బాబ్జీ వంటి దర్శకులు ఆ మహానుభావుడి గురించి చాలా అభిమానాన్ని చూపించారు. 
వెంకయ్య పేరులో "నాయుడు" ను తొలగించినప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని తన కలం గళంతో ఎలుగెత్తి ప్రశ్నించిన వాడు బాబ్జి. మరి అలాంటి బాబ్జికి వెంకయ్య నాయుడు మా వాడు అని చెప్పుకుంటున్న "సినిమా కాపులు" ఏ మాత్రం మద్దతిచ్చారు. వెంకయ్య నాయుడు గురించి పరిశోధనలు చేసిన వారు భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఆధ్యుడు కాదు వెంకయ్య నాయుడే ఆద్యుడు అన్న ఆధారాలు సంపాదించారు. వందేళ్ళ సినిమా ఉత్సవం చెన్నై లో జరిగినప్పుడు ఆ మహానుభావుడి ఫొటొ ఒక్కటి కూడా పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు తెలుగు "సినిమా కాపులు" ఏం చేస్తున్నారు? 

రఘుపతి వెంకయ్య నాయుడు పై 15-10-2012 న బాబ్జి దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా అప్పట్లోనే పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. నిర్మాత ఆర్థిక ఇబ్బందులతోనో మరే ఇతర కారణాల వల్లనో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

గత రెండు నెలల క్రితం సినిమా పెద్దలు దాసరి నారాయణరావు గారు ఈ సినిమాను  కొన్నట్లుగా తెలిసింది. ఎందువల్లనో ఆయన కూడా ఈ సినిమాను విడుదల చేయలేదు. ఈ రోజు విడుదల చేసి వుంటే బాగుండేది.

 ప్రపంచానికి దిక్సూచిని అందించిన వారు కాపులు, ప్రపంచానికి వాణిజ్యాన్ని నేర్పించిన వారు కాపులు. మొట్టమొదట వజ్రాన్ని సానబట్టిన వారు కాపులు. చరిత్రనంతా కోల్పోయాము ఇంకా కోల్పోవడానికి మన వద్ద ఏమీలేదు. మొన్న శ్రీకృష్ణదేవరాయలు బలిజ వంశీయుడు కాదన్నారు కొందరు. నిన్న రఘుపతి వెంకయ్య నాయుడు బలిజ నాయుడా? కమ్మ నాయుడా? అని కొందరు ప్రశ్నించారు? ఇకనైనా ఈ జాతి నిద్ర లేవక పోతే మీ చరిత్రను ఇతరులు క్లెయిం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త.

రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రాన్ని వెంటనే విడుదల చేసి ఆ మహానుభావుడికి ఘనంగా నివాళి అర్పించ వలసిందిగా గౌరవనీయులు, పెద్దలు దాసరి నారాయణరావు గారిని సవినయంగా వేడుకుంటున్నాము.

దయచేసి ప్రపంచ వ్యాప్తంగా వున్న కాపులు వెంకయ్య నాయుడు సినిమాను విడుదల చేయమని దాసరి గారిపై వత్తిడి తీసుకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
******************* 

బుధవారం ఆంధ్రభూమిలో వచ్చిన ఈ ఆర్టికల్ ను కూడా చదవండి  

              




వెంకయ్య నాయుడికి సాక్షి దినపత్రిక ఇచ్చిన నివాళి ఇదికూడా చూడండి



14, అక్టోబర్ 2014, మంగళవారం

పలనాటి యుద్ధం ఏకపక్షంగా వ్యక్తీకరించబడింది. (నాయకురాలు నాగమ్మ -1)




         పలనాటి యుద్ధానికి సంబంధించిన గాధ మొత్తం ఒక వర్గం కోణం లోనే ఆవిష్కరించబడినట్లు కనిపిస్తుంది.. శ్రీనాథుడు సైతం ఒకవైపు నుండే చూసి పలనాటివీరచరిత్రాన్ని రాసినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఈ కథను మౌఖికంగా ప్రచారం చేసిన వీరవిద్యలవాండ్ల ద్వారా చెప్పించుకుని దానిని తనదైన శైలిలో గ్రంధస్తం చేసి వుండవచ్చు.

     ఎందుకు ఇలా ఒక వర్గం కోణం లోనుండే పలనాటి యుద్ధ చరిత్ర రాయబడిందని నేను ఆరోపిస్తున్నానంటే ఈ కథలో వున్న పాత్రలు అన్నీ ఎక్కువగా బ్రహ్మనాయుడి వర్గానికి సంబంధించిన వారివి కావడం, వారితో సంబంధాలు ఉన్నవారివే కావడం వలన నేను ఈ అభిప్రాయానికి రాక తప్పడం లేదు.

     నాగమ్మ వర్గం వైపు పాత్రలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరిగి వుంటుందంటే ఈ కథను ఎక్కువగా ప్రచారం చేసిన కళాకారులు. బ్రహ్మన్నాయుడి కి సన్నిహితులు కావడం తో వారికి బ్రహ్మనాయుడి వైపు పాత్రల పరిచయం మాత్రమే వుంటుంది. నాగమ్మ వర్గీయులలో చాలామంది వివరాలు బయటకు రాకపోవడానికి వారి గురించి ఈ కళాకారులకు  తెలియకపోయివుండవచ్చు. 

    ఇక మరో విషయం ఏమిటంటే పలనాటి వీరుల చరిత్రలు చెప్పే వీరవిద్యల వాండ్లు అనుగురాజు పెద్ద భార్య వీరవిద్యాదేవి పేరు పైన ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

   అంటే ఆ కాలంలోనే ప్రచార మాధ్యమాల ప్రభావాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్న వ్యక్తి బ్రహ్మనాయుడని చెప్పుకోవచ్చు. ఈ ప్రచార బృందాల ఏర్పాటులో రాణిపేరును వినియోగించుకున్న బ్రహ్మనాయుడు  నేటి ఆధునిక  రాజకీయనాయకుల పంధాను (సోనియాగాంధి ప్రాపకం కొరకు రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ఏర్పాటు)  900 ఏళ్ళక్రితమే అమలు చేశాడంటే నిజంగా ఆశ్చ్యర్యం వేస్తుంది.

    అలా బ్రహ్మన్నాయుడి అండదండలతో ఏర్పడిన ఈ కళా బృందాలు తమకు అన్నం పెట్టిన వారిని కీర్తించక మరెవరిని కీర్తిస్తారు? 

    ఈ క్రమంలోనే వారు ఈటు వైపు చూపిన శ్రద్ధ వైరి పక్షం పాత్రల పై చూపలేక పోయి వుండవచ్చు అంద్కుకే నాగమ్మ వర్గం వారి వివరాలు పూర్తిస్థాయిలో  లభించవు. 

    మలిదేవరాజు అంతఃపురం కాపలా యువతి "మాడచి" అన్న పేరును కూడా ప్రచారం చేయగలిగిన వారు నాగమ్మ కుటుంబం గురించి కూడా సరిగా వివరాలందించలేకపోయారు. బ్రహ్మనాయుడి దత్తు కుమారుల పేర్లు సైతం చెప్పగలిగిన వారు నలగామరాజు భార్య వుందో లేదో కూడా చెప్పలేక పోయారు. 

   మనం సాధారణంగా గమనిస్తుంటాము. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడినప్పుడు ఎవరి ని వారు తమను సమర్థించుకుంటూ వాదనలు వినిపిస్తారు. నాకెందుకో పలనాటి చరిత్రలో వీరవిద్యావంతులు కానీ, శ్రీనాథుడు గానీ బ్రహ్మనాయుడి తరపున వాదనలు వినిపించినట్లుగానే కనిపిస్తోంది. ఓక వైపు వారు చెప్పే కథ విని అవతలి వారిని దుర్మార్గులుగా వర్ణించడం ఎంతవరకు న్యాయం?


    పాపం నాగమ్మ ప్రచార మాధ్యమాల ప్రభావం తెలియని అమాయకురాలిలా కనిపిస్తోంది. జర్మనీ నియంత హిట్లర్ కు అత్యంత సన్నిహితుడు "పాల్ జోసెఫ్ గోబెల్స్" అనే నాజీ లీడర్. ఈయనను హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా నియమిచాడు. హిట్లర్ చేసే పనులన్నింటినీ చాలా గొప్పవని, హిట్లర్ అవతార పురుషుడని ఉత్త అబద్ధాల ప్రచారం చేసేవాడు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలలో హిట్లర్ గొప్ప నాయకుడిగా మనుగడ సాగించాడు. 

      ప్రచారం యొక్క ప్రభావం ఏంటో నాజీ నియంత హిట్లర్ కు తెలుసు. దానితోనే ప్రజలను మొసం చేశాడు కానీ ప్రపంచాన్ని మోసం చేయలెకపొయాడు.

      మన బ్రహ్మన్నాయుడు గారికి హిట్లర్ గారికి పోలికలేమైనా కనిపిస్తున్నాయా...

        నాకైతే కనిపిస్తున్నాయి.

    బ్రహ్మన్నాయుడిని విష్ణువాంశ సంభూతుడిగా ప్రచారం చేసిన వారికి, హిట్లర్ ను మించిన నాయకుడు ప్రపంచంలో లేడని ప్రచారం చేసిన గోబెల్స్ కు తేడా నాకెక్కడ కనిపించడం లేదు.

     అందుకే పలనాటి చరిత్ర ఏకపక్ష దర్పణమనే నేను అభిప్రాయపడుతున్నాను. అబద్ధాలు చెప్పేవాడు ఎక్కడో ఒకచోట తడబడతాడు.కానీ పలనాటి చరిత్రలో అలాంటి తడబాట్లు చాలా వున్నాయి.

      ఈర్ష్యతో ఉండేవాడు అసూయను, అక్కసును తన మాటల్లో వెళ్ళగక్కుతాడు. అలాంటి అక్కసు కూడా పలనాటి చరిత్రలో చాలాచోట్ల తారస పడుతుంది.   
                                                                                                                                             (ఇంకా వుంది)

3, అక్టోబర్ 2014, శుక్రవారం

నాయకురాలు నాగమ్మ నాయకురాలే... ప్రతి నాయిక కాదు....



    


      వెయ్యి సంవత్సరాల క్రితం జీవించి ప్రపంచం లోనే తొలి మహిళా మహామంత్రిణి గా పిలువ బడిన నాయకురాలు నాగమ్మ. స్వార్థపరుల ఓర్వలేనితనం, కుహనా ప్రచారకుల అబద్ధపు ప్రచారాలతో ఆమెను ఓ విషపు నాగుగా చిత్రీకరించారు. పలనాటి యుద్ధం లో నాగమ్మే నిజమైన హీరో. అనేక  చారిత్రక అంశాలను పరిశీలించిన తరువాత నాగమ్మ ఉదాత్తత ను, గొప్పదనాన్ని బయటకు రాకుండా చరిత్రకు మసిపూసి మారేడుకాయను సృష్టించారనిపించింది. నిజానికి పలనాటి యుద్ధం జానపదుల మౌఖిక గాథ గానే ప్రచారం పొందింది. దానినే శ్రీనాథుడు "పల్నాటి వీరచరిత్రము" గ ద్విపదలో రచించారు. తరువాత చాలామంది రచయితలు చిలవలు పలవలు అల్లి దానినే మరింత అందంగా తీర్చిదిద్దారు.
       ఎవరి కథలో చూసినా నాగమ్మను కుటిలనీతికి ప్రతినిధిగానే చూపించారు. నాకు ఈ కథలు చదువుతోంటే ఎన్నో అనుమానాలు చాలాచోట్ల పూరించకుండా వదలివేసిన ఖాళీలు కనిపించాయి. కొన్నిచోట్ల నాగమ్మపై అక్కసు వెళ్ళగక్కుతున్నట్లుగా అనిపించింది. గురజాల ప్రాంతాన్ని ఏలుతున్న అనుగురాజు వేటకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో అనామకురాలైన నాగమ్మ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడై ఏడు ఘడియల పాటు మంత్రి పదవిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఎవరూ కూడా నాగమ్మ ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
    ఒక మహరాజుకు ఒక అనామకురాలు విందు ఏర్పాటు చేయడమేమిటి? ముక్కూ ముఖం తెలియని అనామకురాలు విందు ఏర్పాటు చేస్తే రాజు వెళ్ళి తినడమేంటి? అనామకులు విందుకు పిలిస్తే రాజు లాంటి వారు వారి సైన్యంతో విందుకు వెళతారా??? 
      ఇక మరో సందేహం ఎప్పుడో అనుగురాజు వాగ్దానం చేస్తూ ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానంటే దాన్ని ఆయన హయాం లోనే అనుభవించక అనుగురాజు కొడుకు నలగాముడు రాజ్యం చేస్తున్న కాలంలో నాగమ్మ ఎందుకు మంత్రి పదవిని కోరింది? 
      సరే నలగాముడి కొలువులో మంత్రి పదవి చేపట్టిన నాగమ్మ ఏడు ఘడియల తరువాత పదవిని ఎందుకు త్యజించలేదు? 
       కేవలం అతి కొద్దికాలం మంత్రి పదవిలో వున్న నాగమ్మ మాటలు విని కొన్ని ఏళ్ళుగా మంత్రి పదవిలో వున్న బ్రహ్మన్నను నలగాముడు ఎందుకు వదులుకున్నాడు.
      మంత్రి పదవి పోయిన తరువాత బ్రహ్మనాయుడు ఏంచేశాడు? 
     ఇలా ఎన్నో సందేహాలు. అబద్ధం చెప్పేవాడు ఎక్కడో ఒక చోట తడబడతాడంటారు. అలాంటి తడబాట్లు పలనాటి చరిత్రలో చాలా కనిపిస్తాయి. అలాంటి చోట్ల హాస్యాస్పదమైన కారణాలు చాలా చూపిస్తారు.
     ఇక బాలచంద్రుడినైతే ఏకంగా మహాభారతంలో అభిమన్యుడితో పోలుస్తారు. కొన్ని కథలలో ఏకంగా పలనాటి యుద్ధానికి బాలచంద్రుడు కారణమవుతాడని జ్యొతిష్కులు చెబితే బ్రహ్మనాయుడు చంపి వేయాల్సిందిగా ఆదేశించాడని రాశారు. 
   ఈ కథలలో బ్రహ్మనాయుడును కేంద్రంగా చేసి ఆయనను దైవాంశ సంభూతుడుగా చూపించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆయన కథానాయకుడైతే ఆయనకు వ్యతిరేకంగా వున్న నాగమ్మ ప్రతినాయకురాలేగా... బ్రహ్మనాయుడుకు లేని గొప్పదనాన్ని ఎలాగైతే అంటగట్టారో అలాగే నాగమ్మలో లేని దుష్ట లక్షణాలను ఆమెకు ఆపాదించారు. 
      వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇతిహాసాన్ని విశ్లేషించడం నిజంగా ఒక సాహసమే... ఆ సాహసానికి నేను ఒడిగట్టాను చరిత్రలో పూరణకు నోచుకోని అనేక  ఖాళీలను పూరించడానికి నడుంకట్టాను. నా  సాహసోపేతమైన ఈ నిర్ణయానికి స్వర్గంలో వున్న నా పెద్దలు, నా వంశీయులు, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందజేయమని వినమ్రతతో ప్రార్థిస్తున్నాను.

                                                                                                                                          -రచయిత